గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Saturday, August 28, 2004

రెండు కవితలు

నాకు నచ్చిన రెండు కవితలు పోస్ట్ చేస్తున్నాను. (అంటే నచ్చిన కవితలు ఇవి మాత్రమే అని కాదు. ) కాపీ రైట్లు ఆయా రచయిత(త్రు)లకు చెందుతాయి.

తలుపు - ఇస్మాయిల్

నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరుచుకుని
వెళ్ళిపోయావు నీవు

నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.

ఆకురాలు కాలం - మహెజబీన్

అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు

ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది

వద్దు...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు

అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ...

అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు

అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు వెంటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా అతన్ని నా గుండెలో దాచుకుంటాను

అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకు రాలే కాలానికి ఎక్కడ రాలి పడ్డాడో?

Wednesday, August 18, 2004

దానవీరశూరకర్ణ - ఓ యాహూ సంభాషణ

రాంకీ : బాసూ, చిన్న డౌటు...

నవీన్ : ??

రాంకీ : వీరుడికి శూరుడికి తేడా ఏంటి?

నవీన్ : వీరుడికి గ్లామర్ ఎక్కువ. ఉదా - గ్రీకు వీరుడు అంటారు గాని గ్రీకు శూరుడు అనరు... (కాసేపు ఆలోచించి) ఇది కాస్త పరిశీలించాల్సిన విషయం. సాయంత్రం డిక్షనరీలో చూసి చెప్తాను.

రాంకీ : డివిఎస్ కర్ణ సినిమాకి ఆ పేరు పెట్టినప్పుదు ఏం ఆలోచించి ఉంటారా అని...

నవీన్ (తల గోక్కుని) : ఏదో తేడా ఉండే ఉంటుంది...

రాంకీ : అవును. కొంచం కనుక్కుని చెప్పు.

నవీన్ : రచ్చబండలో పోస్ట్ చేస్తాను, డిక్షనరీలో దొరక్కపోతే...

రాంకీ : విషయం తేలదని నా ఉద్దేశం. సరే, నిఘంటువు చూసి చెప్పుడి.. దాన్లో దొరక్కపోతే రేపు రచ్చబండలో టాపిక్ ఆఫ్ ద డే...

నవీన్ : రచ్చబండలో తల పండిన విద్వాంసులు చాలా మంది ఉంటారు... ఏదో ఒకటి తేల్చేస్తారు...

రాంకీ : సరే, రేపు శూరతిలకం దిద్దుకుని రా .. :)

కాసేపటి తర్వాత ...

నవీన్ (అప్పుడే కరాటే మీద ఒక ఆర్టికల్ చదివిన ఉత్సాహంతో ) : నాకనిపించేది ఏంటంటే, వీరుడు ఆరెంజి బెల్టైతే శూరుడు బ్లాక్ బెల్టేమో అని..

రాంకీ : నాకు తెలిసినంత వరకు కత్తితో చంపగలిగేవాడు వీరుడు, కంటిచూపుతో గాని కడుపుమంటతో గాని చంపగలిగే వాడు శూరుడు...

నవీన్ : :)))

(ముక్తాయింపు : క్రితం రాత్రి ఒక పాపులర్ సినిమా నటుడి ఇంట్లో తాజాగా జరిగిన హత్య గురించి ఆ తరవాత జరిగిన సంభాషణ సెన్సార్ చేయబడినది.)



Saturday, August 14, 2004

ఉరి తాటికి లొంగని ఒక పూర్ణిమ

ఈ రోజు ఉదయం ధనుంజయ్ ను ఉరి తీసారు. అతడు చేసిన నేరానికి తగ్గ శిక్షే పడింది. నేను ఆలోచిస్తున్నది (అతనికి) ఉరి శిక్ష సబబా కాదా అన్న విషయం గురించి కాదు. ఈ సంఘటనలో ఇంకో కోణం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ధనుంజయ్ నేరం చేసి 14 సంవత్సరాలైంది. అప్పటికి అతనికి పెళ్ళై ఏడెనిమిది నెలలు మాత్రమే అయింది. అతడి భార్య పూర్ణిమ ఆనాటి నుండి ఈ రోజు వరకూ అతడి పక్షాన పోరాడుతూనే ఉంది. కోర్టు తీర్పు, ప్రజల భావాలు ఎలా ఉన్నా, తన భర్త నిర్దోషి అని నమ్మి అతని వైపునే ఉంది. ఒక ఏడు నెలలు కలిసి ఉన్నందుకు జీవితమంతా శిక్ష అనుభవిస్తోంది. అతని తల్లిదండ్రులు అతని పక్షాన ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని నెలల సాంగత్యం ఫలితంగా జీవితమంతా నరకం అనుభవించడానికి సిద్ధమైన పూర్ణిమను చూస్తుంటే భారతీయ స్త్రీకి ప్రతీక అనుకోవాలా, లేక భారతీయ కుటుంబ విలువలకు ఉదాహరణ అనుకోవాలా? ఈ ప్రశ్న నన్ను కచ్చితంగా కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది.

Friday, August 13, 2004

స్వభాష

తొమ్మిదో తరగతిలో అనుకుంటా... తెలుగు వాచకంలో స్వభాష అని ఒక పాఠం ఉండేది. రాసినది పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు అనుకుంటాను. ఆ 1940 కాలం నాటి శైలి అప్పట్లో చదవడానికి తమాషాగా, సరదాగా ఉండేది. మాతృభాషలో మాట్లాడడానికి వెనుకాడే (ఆ రోజుల్లోనే!!) హిపోక్రేట్ల గురించి ఆ వ్యాసంలో ఓ చోట - ఎవరైనా యాయావరపు బ్రాహ్మణుడు మీ ఇంటికి యాచనకు వచ్చి "బాయ్, పాట్ లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కుడ్ యు కైండ్లీ గెటిట్ హియర్? థాంక్యూ ఇన్ యాంటిసిపేషన్" అన్నచో మీరేమి చేయుదురు? - అని వ్యంగ్యపు బాణం వేసారు. ఆ ప్రశ్న ముట్నూరి వారి రోజుల్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రస్తుతం వర్తిస్తుందనుకుంటా. అందులోనూ తెలుగువారి విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. తమ పిల్లలకు ఇంగ్లీషు రాకపోతే భూమ్మీద నూకలు చెల్లినట్లేనని నమ్మే తల్లిదండ్రులున్నంతవరకు, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషు ముక్కలు ఒకటీ అరా నేర్చుకుంటే చాలు, తెలుగులో మాట్లాడడం మాత్రం అవమానంగా భావించే వారున్నంతవరకు ఈ విషయంలో మార్పేమీ ఉండకపోవచ్చు.

ఆ విషయం అలా ఉంచితే నా మటుకు నాకు తెలుగంటే చాలా ఇష్టం. తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం... "ఓరేయ్, తెలుగుతో బాటు ఇంగ్లీషు కూడ బాగా నెర్చుకోవాలి" అని నాన్న తెచ్చి ఇచ్చే ఇంగ్లీషు చందమామను అవతల గిరాటు వేసి మరీ తెలుగు పుస్తకాలు చదివేవాణ్ణి. తరవాత్తరవాత మిగతా భాషల మీద ఆసక్తి కలిగినప్పటికీ అంతకంటే ఎక్కువగా తెలుగు మీద ఇష్టం పెరిగింది.

ఫ్లాష్ బ్యాక్ వదిలి ప్రస్తుతానికి వస్తే ఆ మధ్య నా హోం పేజిలో నా తెలుగు కవితలు కొన్నింటిని పబ్లిష్ చేసినప్పుడు తెలిసింది కంప్యూటర్లో తెలుగు వాడకం ఎంత కష్టమో. ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని కావడం వల్ల నాకు అది అంత కష్టమనిపించకపోవచ్చు గాని మా నాన్నో, లేకపోతే (అదృష్టం కొద్దీ ) కంప్యూటర్ గురించి పెద్దగా తెలియని వారింకెవరికైనా ఇది చాలా కష్టమైన పనే. ఫాంట్స్ డౌన్లోడ్ (అంటే తెలుగక్షరాలు దిగుమతి చేసుకోడం అన్నమాట) చెయ్యడం, ఎన్కోడింగ్ మార్చడం లాంటి పనులు చేసేలోపు చదివే వాళ్ళకు ఆసక్తి చచ్చిపోతుంది. డైనమిక్ ఫాంట్సు వాడడానికి ప్రయత్నించాను గాని ఏం లాభం లేకపోయింది. యూనికోడ్ ఆధారంగా పని చెసే అక్షరమాల లాంటి సాఫ్ట్ వేర్ వాడదామనుకుంటే విండోస్ 2000 లో యూనికోడ్ సపోర్టు సరిగ్గా లేదాయె. అంటే విండోస్ XP ఉంటే తప్ప మిగతా వారికి తెలుగు అక్షరాలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బోగీల్లా డబ్బాలు డబ్బాలుగా కనిపిస్తాయన్నమాట. సరే ఏదైతే అదయ్యిందనుకుని అక్షరమాల వాడి తెలుగులో రాయడం మొదలెట్టాను. దానికి చిన్నప్పుడు చదివిన ఒక గేయం పేరు పెట్టాను. "దారంట ఉంటాయి, దాక్కుని ఉంటాయి" అని మొదలవుతుంది.

గడ్డి పూలు. ఎంత బాగుంటాయి నిజంగా! చిన్నప్పటి బంగారం లాంటి రోజులు గుర్తొస్తాయి వాటిని తలుచుకోగానే. రంగు రంగుల పూలు. ఎన్ని రకాల పూలో! వర్షం పడ్డప్పుడు వాటి మీద ఎన్ని ఇంద్ర ధనుస్సులో!! మొత్తానికి బ్లాగ్ కోసం మంచి పేరు తట్టిందని నన్ను నేను మెచ్చేసుకుని అప్పుడప్పుడు కాసిని తెలుగు ముక్కలు రాసుకుని తృప్తి పడాలని నిర్ణయించుకుని.. ఇదిగో తొలి పోస్ట్ కోసం ఇదంతా రాస్తున్నాను. ఇది ఆరంభ శూరత్వం కాకూడదని కోరుకుంటున్నాను.

ప్రస్తుతానికి ఇంతే సంగతులు... చిత్తగించవలెను.