గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Friday, August 13, 2004

స్వభాష

తొమ్మిదో తరగతిలో అనుకుంటా... తెలుగు వాచకంలో స్వభాష అని ఒక పాఠం ఉండేది. రాసినది పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు అనుకుంటాను. ఆ 1940 కాలం నాటి శైలి అప్పట్లో చదవడానికి తమాషాగా, సరదాగా ఉండేది. మాతృభాషలో మాట్లాడడానికి వెనుకాడే (ఆ రోజుల్లోనే!!) హిపోక్రేట్ల గురించి ఆ వ్యాసంలో ఓ చోట - ఎవరైనా యాయావరపు బ్రాహ్మణుడు మీ ఇంటికి యాచనకు వచ్చి "బాయ్, పాట్ లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కుడ్ యు కైండ్లీ గెటిట్ హియర్? థాంక్యూ ఇన్ యాంటిసిపేషన్" అన్నచో మీరేమి చేయుదురు? - అని వ్యంగ్యపు బాణం వేసారు. ఆ ప్రశ్న ముట్నూరి వారి రోజుల్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రస్తుతం వర్తిస్తుందనుకుంటా. అందులోనూ తెలుగువారి విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. తమ పిల్లలకు ఇంగ్లీషు రాకపోతే భూమ్మీద నూకలు చెల్లినట్లేనని నమ్మే తల్లిదండ్రులున్నంతవరకు, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషు ముక్కలు ఒకటీ అరా నేర్చుకుంటే చాలు, తెలుగులో మాట్లాడడం మాత్రం అవమానంగా భావించే వారున్నంతవరకు ఈ విషయంలో మార్పేమీ ఉండకపోవచ్చు.

ఆ విషయం అలా ఉంచితే నా మటుకు నాకు తెలుగంటే చాలా ఇష్టం. తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం... "ఓరేయ్, తెలుగుతో బాటు ఇంగ్లీషు కూడ బాగా నెర్చుకోవాలి" అని నాన్న తెచ్చి ఇచ్చే ఇంగ్లీషు చందమామను అవతల గిరాటు వేసి మరీ తెలుగు పుస్తకాలు చదివేవాణ్ణి. తరవాత్తరవాత మిగతా భాషల మీద ఆసక్తి కలిగినప్పటికీ అంతకంటే ఎక్కువగా తెలుగు మీద ఇష్టం పెరిగింది.

ఫ్లాష్ బ్యాక్ వదిలి ప్రస్తుతానికి వస్తే ఆ మధ్య నా హోం పేజిలో నా తెలుగు కవితలు కొన్నింటిని పబ్లిష్ చేసినప్పుడు తెలిసింది కంప్యూటర్లో తెలుగు వాడకం ఎంత కష్టమో. ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని కావడం వల్ల నాకు అది అంత కష్టమనిపించకపోవచ్చు గాని మా నాన్నో, లేకపోతే (అదృష్టం కొద్దీ ) కంప్యూటర్ గురించి పెద్దగా తెలియని వారింకెవరికైనా ఇది చాలా కష్టమైన పనే. ఫాంట్స్ డౌన్లోడ్ (అంటే తెలుగక్షరాలు దిగుమతి చేసుకోడం అన్నమాట) చెయ్యడం, ఎన్కోడింగ్ మార్చడం లాంటి పనులు చేసేలోపు చదివే వాళ్ళకు ఆసక్తి చచ్చిపోతుంది. డైనమిక్ ఫాంట్సు వాడడానికి ప్రయత్నించాను గాని ఏం లాభం లేకపోయింది. యూనికోడ్ ఆధారంగా పని చెసే అక్షరమాల లాంటి సాఫ్ట్ వేర్ వాడదామనుకుంటే విండోస్ 2000 లో యూనికోడ్ సపోర్టు సరిగ్గా లేదాయె. అంటే విండోస్ XP ఉంటే తప్ప మిగతా వారికి తెలుగు అక్షరాలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బోగీల్లా డబ్బాలు డబ్బాలుగా కనిపిస్తాయన్నమాట. సరే ఏదైతే అదయ్యిందనుకుని అక్షరమాల వాడి తెలుగులో రాయడం మొదలెట్టాను. దానికి చిన్నప్పుడు చదివిన ఒక గేయం పేరు పెట్టాను. "దారంట ఉంటాయి, దాక్కుని ఉంటాయి" అని మొదలవుతుంది.

గడ్డి పూలు. ఎంత బాగుంటాయి నిజంగా! చిన్నప్పటి బంగారం లాంటి రోజులు గుర్తొస్తాయి వాటిని తలుచుకోగానే. రంగు రంగుల పూలు. ఎన్ని రకాల పూలో! వర్షం పడ్డప్పుడు వాటి మీద ఎన్ని ఇంద్ర ధనుస్సులో!! మొత్తానికి బ్లాగ్ కోసం మంచి పేరు తట్టిందని నన్ను నేను మెచ్చేసుకుని అప్పుడప్పుడు కాసిని తెలుగు ముక్కలు రాసుకుని తృప్తి పడాలని నిర్ణయించుకుని.. ఇదిగో తొలి పోస్ట్ కోసం ఇదంతా రాస్తున్నాను. ఇది ఆరంభ శూరత్వం కాకూడదని కోరుకుంటున్నాను.

ప్రస్తుతానికి ఇంతే సంగతులు... చిత్తగించవలెను.

6 Comments:

Anonymous Anonymous said...

మీరు software లో పని చేస్తారనుకుంట. మీ బ్లొగు చదివి చాలా ఆనందమేసింది. ఇంత చక్కని తెలుగు లో మాట్లాడడం అనేది ఈ కాలం లో ఎంత అరుదో చదివినప్పుడు అంత ఆనందం కలిగిస్తుంది. మీరు ఇంత మంచి ఆలోచనతో ఈ బ్లొగు మొదలుపెట్టారు.దానిక రెథించిన ఉత్సాహం తో ఇంకా మరిన్ని ఆర్టికిల్స్ రాస్తారని ఆసిస్తున్నాను.
- మాధవి.

August 25, 2004 3:01 PM  
Blogger నవీన్ said...

మాధవి గారూ... చాలా థాంక్సండి. కనీసం ఇంకో సంవత్సరం వరకు ఈ బ్లాగుకు ఎవరి కామెంట్లు ఉండవనుకున్నాను :)) మీ ప్రోత్సాహానికి కృతజ్ఞుణ్ణి. మీరు బ్లాగు మొదలెడితే నాకు చెప్పడం మరిచిపోకండేం? నా మెయిల్ అడ్రసు: naveensays@yahoo.com.

August 27, 2004 11:38 AM  
Blogger వెంకట రమణ said...

మీ బ్లాగ్ చాలా బాగుంది. పూర్తిగా తెలుగులో వున్నమీ బ్లాగ్ ను చూసి చాలా ఆనందిచాను. మీ తెలుగు భాషాభిమానానికి నా అబినందనలు.

December 15, 2004 8:17 PM  
Blogger Srinivas Malyala said...

very nice blog , be posting post why u r stopped

April 18, 2005 9:40 PM  
Anonymous Anonymous said...

కమ్రతకు కమ్రత, కఠిణతకు గఠినత, బిగికి బిగి, జోరుకు జోరు, నన్ని వన్నెలూ, నన్ని చిన్నెలూ గల మన మాతృభాషనే వ్యాసమునకు, ఉపన్యాసమునకు, కవిత్వమునకు, గానమునకు సంపూర్ణార్హతగల భాష।

-chava kiran

June 14, 2005 4:05 PM  
Blogger Unknown said...

gaddipoolu...? ante ento nijanga naku theleedu... koncham theliyajesthara... dayachesi?

December 04, 2008 2:47 PM  

Post a Comment

<< Home