గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name: నవీన్ నంబూరి
Location: హైదరాబాదు, India

ఓ అయోమయం కుర్రాడు

Tuesday, October 23, 2007

నువ్వు లేనప్పుడు...

నువ్వున్నప్పుడు...
టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ
నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి
నీ మీద వెధవ జోకులేస్తూ మేధావిలా ఫోజెట్టి
కిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి
ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...

నువ్వు దగ్గర లేనప్పుడు...
రేడియోలో రఫీ పాటలు వింటూ
తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని
నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ
గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ
స్థాణువునై పడున్నాను

Sunday, October 21, 2007

ఒక పాత ఉత్తరం...

2nd Feb 2004
9:25 pm
Hotel room

చెట్లు గాలికి మంత్రముగ్ధంగా తలూపడం అనేది యండమూరి నవల్లో చదవడం తప్ప నేరుగా అనుభవించి చాలా రోజులైంది. ఇదిగో ఈ రాత్రి మళ్ళీ చూస్తున్నాను. చుట్టూ చీకటి. గదిలో లైట్లన్నీ ఆర్పేసి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూస్తున్నాను. చీకట్లో కూర్చుని దూరాన కనిపించే మిణుకు మిణుకు వెలుతురు చూడడం భలే బాగుంది.

రేపు జర్మనీలో నేను గడపబోయే ఆఖరి రోజు. అంటే రెండు వారాల తర్వాత మళ్ళీ వస్తాననుకో. నా మొదటి ట్రిప్ కి రేపు ఆఖరి రోజన్నమాట. వచ్చినప్పట్నుంచి అనుకుంటూనే ఉన్నాను. జర్మనీ అనుభవాల గురించి రాయాలని. యథాప్రకారం బద్ధకం వల్లా, టైం లేకపోడం వల్లా (ఛా!) ఇంతవరకు ఎం రాయలేదు. సరే, better late than never అనుకుని ఇదిగో తోచిందీ, గుర్తుకొచ్చిందీ రాసేస్తున్నాను.

ఇందాక రెస్టారెంట్లో తిన్న ఇటాలియన్ వంటకం (అదేదో నోరు తిరగని పేరు) తాలూకు సువాసన ఇంకా చేతిని వదల్లేదు. భోంచేసాక ఆరుబయట అలా నడిచి వద్దామనుకున్నాను గాని చలికి తోడు గాలి వీస్తుండడంతో ఆ ఆలోచన మాని గదికొచ్చేసాను. గదిలోకొచ్చి తలుపేసి కదలకుండా అలాగే కాసేపు నిలబడ్డాను. ఎందుకో చీకట్లో కూర్చోవాలనిపించింది. లైట్లన్నీ ఆర్పేసి కిటికీ దగ్గరకొచ్చాను.

గాలికి మంత్రముగ్ధంగా చెట్లు తలూపుతున్నై (నిజంగానే). ఏం చెట్లో ఏమో. రేపు ఎవర్నైనా అడగాలి. జర్మనీలో ఎక్కడ చూసినా కనపడతై. నిన్న మొన్నటి దాకా మంచులో తడిసి ముడుక్కున్నవల్లా ఈ రోజు స్వేచ్ఛగా అటూ ఇటూ ఊగుతూ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. చెట్ల చిటారు కొమ్మల వెనుక క్షితిజరేఖ తాలూకు పలుచని కాంతి అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. చూట్టానికి చెట్లు - మొదల్లు లేకుండా - గాల్లో నిలబడినట్లు అనుభూతి కలుగుతోంది. చిత్రకారులు, కవులు ఇలాంటి దృశ్యాల ప్రేరణతోనే పుడతారనుకుంటా.

పోయిన వారం చూసుండాలి. ఎక్కడ చూసినా మంచు. ఎటు చూసినా తెలుపే. It looked as though the world has been painted white. మంచు మైదానాలు, మంచు తిన్నెలు, మంచు వాకిల్లు, మంచు పొదరిండ్లూ, మంచు పూలూ... ఒకటని కాదు. అన్నీ మంచు ముసుగు కప్పేసుకున్నాయి. నువ్వన్నావు చూడు రంగులన్నీ కలిసిపోయినట్టు, తెలుపు తప్ప ఇంకేదీ లేనట్టు... నాకు అన్నిటికన్నా నచ్చింది మాత్రం మంచులో తడిసిన చెట్లు. ఎంత బావుంటాయో. ఆ ఇంకానేమో ఆల్ప్స్ పర్వతాలు. ఫ్లైట్లోంచి చూసాను. గుండె లయ తప్పిందంటే నమ్ము. మిలన్ నుంచి మ్యూనిక్ వచ్చానా... బుల్లి ఫ్లైట్.. ఈడ్చి కొడితే 30 మంది ప్రయాణికులు. మగత నిద్రలో కాసేపు తూగి ఎందుకో కిటికీలోంచి చూసానా... మతి పోయే దృశ్యం. కనుచూపు మేరా వ్యాపించిన మంచు కొండల సముదాయం. ఫ్లైట్ అప్పుడప్పుడూ ఏటవాలుగా వాలుతుంది చూడు.. అప్పుడు చూడాలి.. అద్భుతమైన వ్యూ! మంచు కొండలూ, వాటి మధ్యలో నల్లటి సరస్సులూ... ఆకాశంలో రంగు రంగుల చిత్రాలు గీస్తూ సూర్యుని కిరణాలూ. ఒక్క నిమిషం కూడా కనురెప్ప వేయకుండా చూసాను. మళ్ళీ చూస్తానో లేదో అని. ఫోటోలు కూడా తీసాను. ఎలా వస్తాయో ఏమో.

హైదరాబాదు నుండి మిలన్ వరకు ప్రయాణం ఎంత బోర్ కొట్టిందో మిలన్ నుంచి మ్యూనిక్ వరకు అంత సరదాగా సాగింది. మిలన్ ఎయిర్పోర్టులో మూడున్నర గంటలు వెయిటింగ్ టైం. పొద్దుటే ఆరుకి దిగాను మిలన్లో. మ్యూనిక్ కి వెళ్ళే టెర్మినల్లో ఎవరూ లేరు ఆ టైంలో. మూడు గంటలు టైం పాస్ చెయ్యడానికి మిలన్లో హింది సినిమాలు ఉండవు కదా, ఎలారా బాబూ అనుకుంటూ ఉంటే ఒక మూల ఒకతను కనిపించాడు. చూడబోతే ఇండియన్ లా ఉన్నాడు. మిలన్లో ఫోటో తీసుకున్నట్లు ఉంటుంది కదా అని అతనికి కెమెరా ఇచ్చి ఒక ఫొటో తీయమన్నాను. ఫోటో తీసాక పరిచయం చేసుకున్నాను. గోవా నుంచి వస్తున్నాడంట. ఇటలీలో జెనోవా కి వెళ్తాడంట. ఏడు సంవత్సరాలనుంచి ఇటలీలోనే ఉంటున్నానని చెప్పాడు. బాగా మాటకారిలా ఉన్నాడు (నా కంటే.. ;-) కేటరింగ్ పని చేస్తున్నాడంట. ఇటలీలో ఇండియన్లు చాలామంది అక్కడి ఇళ్ళలో పని చేస్తారని, కేటరింగ్ జాబ్ దొరకాలంటే చాలా కష్టపడాలని చెప్పాడు. ఇంకానేమో తనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆమె గురించి కాసేపు ఏదో చెప్పాడు.

ఇంతలోపల చుడీదార్లో ఉన్న ఒక గోరీ మేం వచ్చి పలకరించింది. "చూట్టానికి ఇండియన్లలా ఉన్నారు. కాస్త సాయం చెస్తారా? ముంబైలో ఉండే నా స్నేహితురాలికి ఫోన్ చేద్దామంటే లైన్ దొరకట్లేదు. లైన్ సమస్యో లేక ఈ కాలింగ్ కార్డు పని చెయ్యట్లేదో అర్థం కావట్లేదు...". సరే పదమని తనతో వెళ్ళి కాసేపు ప్రయత్నించాను. హైదరాబాదుకి దొరుకుతోంది గాని ముంబై కి లైన్ దొరకట్లేదు. తను కూడా చాలా సేఫు ప్రయత్నించి విసుగొచ్చి ఆపేసింది. సరేనని ఇక మాటలు మొదలెట్టాం. తన పేరు మారియోన్ అని చెప్పింది. మ్యూనిక్ తన సొంత ఊరంట. జర్మన్, ఇంగ్లీషు భాషలు చెప్తుందంట ఏదో స్కూల్లోనో, కాలేజిలోనో. ఐదు వారాలు సెలవు మీద ఇండియా చూడాలని వచ్చిందంట. అందులో ఒక వారం ఎవరో గురూజీ గారి సేవ కోసమంట! ఇండియాకి రావడం అది రెండో సారంట. ఇండియా అంటే చాలా ఇష్టమంట. ఒక గంట సేపు మాట్లాడాం. ఇంతలో గోవా అతను కస్మెరో రోడ్రిగెజ్ కూడా వచ్చి కలిసాడు. చాలాసేపు మాట్లాడి ఒకరి కాంటాక్ట్ డీటెయిల్సు మరొకరికి ఇచ్చుకున్నాం. ముగ్గురం కలిసి ఫోటో దిగాలని డిసైడ్ అయ్యాం. ఎవరినడగాలా అనుకుంటూ ఉంటే పక్కనే ఒకతను కనిపించాడు.

డేవ్ అని అమెరికన్. ఇమ్యునాలజీలో Ph.D. చేస్తున్నాట్ట బెర్లిన్ లో. మా ముగ్గురి ఫోటో తీసాడు. తరవాత డేవ్ తో కబుర్లు. యూరోపియన్లకు, అమెరికన్లకు మధ్య తేడా కాస్తో కూస్తో కనపడింది మారియోన్, డేవ్ ల మధ్య. మారియోన్ ఐదు వారాలు సెలవు పెట్టి ఇండియా వెళ్ళొచ్చిందని తెలియగానే ఆమె మీద జోకులేసాడు. మీ జర్మన్లు మరీ విచిత్రం. మరండీ, మేము ఇరవై ఎనిమిది వారాలు సెలవు మీద వెళ్ళొచ్చామండి అంటే ఎలా ఉంటుందేంటి అని విరగబడి నవ్వాడు. He has an extra funnybone I guess. ముగ్గురం బాగా కలిసిపోయాం. టైం తెలియకుండా మాట్లాడుకున్నాం. మారియోన్, నేను ఒకే ఫ్లైట్లో మ్యూనిక్ కి వెళ్ళాలి. డేవ్ బెర్లిన్ కి వెళ్తుండగా, కస్మెరొ జెనోవాకి వెళ్తున్నాడు. డేవ్, కస్మెరో మాకంటే ముందుగా, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. మారియోన్, డేవ్, నేను కలిసి ఒక ఫోటో దిగాము డేవ్ వెళ్ళిపోయేముందు.

ఫ్రీజింగ్ అంటే ఏంటో మిలన్లో అనుభవానికొచ్చింది నాకు మొదటి సారి. గ్లోవ్సు, వులన్ క్యాపు..ప్చ్, ఏమీ లాభం లేదు. మారియోన్ కైతే అవి కూడా లేవు. పాపం ఇండియా హేంగోవర్లో ఉందేమో... చెప్పులేసుకుని వచ్చింది. కాసేపట్లో సన్నగా వణకడం మొదలెట్టింది. పాత హిందీ సినిమాలో శశి కపూర్లా నా జాకెట్ ఆఫర్ చేద్దామనుకున్నాను గాని ఏడిసినట్లుంటుందని ఆ పని చెయ్యలేదు. ఫ్లైట్లోకి ఎక్కాక మారియోన్ పరిస్థితి మెరుగయింది. ఆల్ప్స్ మీద ప్రయాణం మరిచిపోలేని అనుభూతి. మ్యూనిక్ ఎయిర్పోర్టులో మారియోన్ వాళ్ళ అమ్మానాన్నా వచ్చారు ఆమెను రిసీవ్ చేసుకోడానికి. వీలున్నప్పుడు తనకు ఫోన్ చెయ్యమని చెప్పి మరియోన్ వెళ్ళిపోయింది. నేను ఎయిర్పోర్టు బయటికొచ్చి ఒక ట్యాక్సీని మాట్లాడుకుని నేరుగా ఆఫీసుకి వెళ్ళిపోయాను. ఆఫీసులో ఎదురైన అనుభవం... it was a different story altogether. ఇంకోసారి రాస్తా వీలైతే. ప్రస్తుతానికి ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

Monday, May 29, 2006

సినీ సమీక్షా తోరణం...

ఆ మధ్య సినిమా సమీక్షల కోసం ఒక బ్లాగు మొదలెట్టాను. నేను చేసే మిగతా పనుల్లాగే అది కూడా నత్తనడక నడుస్తోంది. ఈ రోజు కాస్త వెసులుబాటు దొరకడంతో గోదావరి రివ్యూ రాసాను. వీలైనప్పుడల్లా మరిన్ని సమీక్షలు రాయాలనుకుంటున్నాను.

Monday, April 17, 2006

వానకు తడిసిన పువ్వొకటి...

కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టు ఈ మధ్య నేనొక విషయాన్ని కనిపెట్టాను. ఏమిటంటే, కాస్తంత గ్యాప్ తర్వాత తిరిగి కవిత్వం చదువుతుంటే భలే బావుంటుందని. అలాగే పనిలో పనిగా ఇంకో విషయం కూడా కనిపెట్టాను. అదేంటంటే పాలపర్తి ఇంద్రాణి అనే ఆవిడ కవితలు రాస్తారని. రాస్తారంటే మామూలుగా కాదు - మనసుకు హత్తుకునే కవితలు... మనమే మనకోసమే రాసుకున్నామా అనిపించే కవితలు... అతి సాధారణంగా గడిచిపోయే రోజువారీ జీవితం లోపలి పొరల్లో దాగున్న అంతులేని కవిత్వాన్ని ఆవిష్కరించే కవితలు - మామూలు మాటల్లో అలవోకగా రాస్తారని.

ఒక వెబ్ సైటులో మొన్నొక కవిత చదివాను. రచయిత్రి పేరు పాలపర్తి ఇంద్రాణి అని ఉంది. ఆవిడ పేరు మీద నెట్లో వెదికితే మరి కొన్ని కవితలు దొరికాయి. ఆ మధ్య ఆవిడ కవితా సంకలనం "వానకు తడిసిన పువ్వొకటి" కి ఇస్మాయిల్ స్మారక అవార్డు కూడా వచ్చిందట. నేను సేకరించిన కవితలు పోస్టు చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయా పబ్లిషర్ల కాపీరైటు హక్కులు ఉల్లంఘించడం నా ఉద్దేశం కాదని మనవి. ఇవి చదివాక పుస్తకాన్ని కొని చదువుతారని ఆశిస్తున్నాను.

వానకు తడిసిన పువ్వొకటి

వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతుంది బావిలో
సుళ్ళుసుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ...
నవ్వుతూనే వుందది
తుళ్ళుతూనే వుందది
నీళ్ళమీద తేలుతూ వుంది..
పాతకొమ్మని
కొత్తనీళ్ళని
చూస్తూవుందది
మార్చి మార్చి

ఓ సాయంకాలం

ఒక్కో పువ్వు నీళ్ళల్లో రాలుతూ
ఒక్కో వలయాన్ని సృష్టిష్టోంది
జారిపడుతున్న పూలని
జరిగిపోతున్న వలయాలని
చూస్తూ చూస్తూ చూస్తూ
కాళ్ళు ఊపడం మర్చిపోయి కూర్చుండిపోతాను
టీ చల్లారి తరక కట్టిన సంగతే గమనించను

పిట్ట స్నానం

మిట్ట మధ్యాహ్నం వేళ
పిట్ట ఒకటి చక్కర్లు కొడుతోంది
నీటి దొన్నె పక్క వాలి
ఒక్కో కంటితో విస్మయపడుతోంది
ముక్కునటూ ఇటూ తాటిస్తూ
బుడుంగున తల ముంచుతోంది
రెక్కలల్లాడిస్తూ కిచ కిచమని
గాలి గుర్రం ఎక్కి పోతోంది

పిల్లలు నిద్దరోతున్నారు

రివ్వున కొట్టే శీతాకాలపు చలిగాలులు
తలుపు తట్టకుండానే వెనక్కు మళ్ళుతాయి
ఘుమ్మని వాసన జల్లే మల్లెమొగ్గలు
కిటికీలోంచి మెల్లిగా తొంగి చూస్తాయి
ఘల్లని కదిలే పెరటి చెట్ల ఆకులు
చప్పుడు చేయవద్దని గుసగుసలాడుతాయి
రైయ్యని ఎగిరే గాలిపటాలు
ముందు గదిలో నిశ్శబ్దంగా వేచి ఉంటాయి

వాగు

లోలోపల మట్టి మాట్టాడకుండా కూర్చుంటుంది
పైపైన వాగు గల గల గలా ప్రవహిస్తుంటుంది

లోలోపల బండరాళ్ళు నాచు పట్టి నిద్రపోతుంటాయి
పైపైన గడ్డిపోచలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి

లోలోపల చేపలు కుటుంబాలతో నివసిస్తుంటాయి
పైపైన తెప్పలు మనుషులతో తరలిపోతుంటాయి

లోలోపల నల్లని చీకటి అలుముకుని ప్రవహిస్తుంటుంది
పైపైన తైతక్కలాడే కాంతి కిరణాలతో వాగు నవ్వుతూ ఉంటుంది

మీరు

నీలిమబ్బుల మీదకెక్కి
ఈల వేస్తాను
గాలిరాగాలెన్నో కట్టి
తేలిపోతాను
వగరు బీరును తాగినట్టు
వూగిపోతాను -
ఆ రోజుల్లో ఆ వయసులో అప్పుడు
మీరు గుర్తొచ్చిన ప్రతిసారీ ఎప్పుడూ...

ప్రయాణం

విసురుగ వీచే గాలిలో
జోరుగ సాగే ఈ రైలు
వూపేస్తోంది నన్నేనా?
పుస్తకంలో మునిగిన
మిమ్మల్ని కూడానా?
అతిగా కాచే ఎండలో
గతి తప్పిన ఈ ఎడారి ఓడ
తీరని దాహం నాకేనా?
దిక్కులు చూస్తోన్న
మీకు కూడానా?

Tuesday, January 10, 2006

యాహూ! అని తెలుగులో అరవండి...

ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. ఎంఎస్ఎన్ మెసెంజరులో చాలా రోజుల్నుంచి ఉంది గాని యాహూలో ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు యాహూ మెసెంజరులో కూడా యూనికోడ్ (ఇండిక్) సపోర్టు బావుంది. అంటే తెలుగులో భేషుగ్గా మాట్లాడుకోవచ్చన్నమాట. మొన్న మా కొలీగ్ నేను యాహూలో తెలుగులో మాట్లాడ్డం చూసి చాలా ఆశ్చర్యపడేసరికి, ఈ విషయం తెలియని వాళ్ళు, అంతగా గమనించని వాళ్ళు, తెలుసుకుంటారు కదా అని ఈ పోస్టు చేస్తున్నాను.

Monday, December 26, 2005

ఈ మధ్య తరచుగా వింటున్న పాటలు...

ఈ మధ్య పని ఒత్తిడి కాస్త తగ్గడంతో హాయిగా సంగీతం వినడానికి వీలు దొరికింది. ఎందుకో చిన్నప్పుడు ఆకాశవాణిలో విన్న 70, 80 దశకాల సినిమా పాటలు పదే పదే గుర్తుకు వస్తూండడంతో వాటిని సేకరించే ప్రయత్నంలో పడ్డాను. ఒక రెండు వారాలలో బాగానే పోగయ్యయి. వాటిలోంచి మళ్ళీ మళ్ళీ వింటున్న పాటలు(అంటే ఇళయరాజా పాటలు మినహాయించి. ఆయన పాటలు వేరేగా వింటానన్నమాట):

అల్లరి బావ - మధువనిలో రాధికవో
అమరజీవి - ఓదార్పు కన్న చల్లనిది
అమెరికా అమ్మాయి - ఒక వేణువు వినిపించెను
అందమె ఆనందం - మధుమాస వేళలొ
చుట్టాలున్నారు జాగ్రత్త - రెక్కలు తొడిగి
దీక్ష - మెరిసే మేఘమాలికా
ఏడంతస్థుల మేడ - ఇది మేఘసందేశమో
ఎదురీత - తొలిసారి ముద్దివ్వమంది
ఇంద్రధనుస్సు - నేనొక ప్రేమపిపాసిని
ఇంటింటి రామాయణం - ఎడారిలో కోయిల
ఇంటింటి రామాయణం - ఈ తరుణము
ఇంటింటి రామాయణం - మల్లెలు పూసే
ఇంటింటి రామాయణం - వీణ వేణువైన
జేబుదొంగ - నీలాల నింగిలో
కన్నెవయసు - ఏ దివిలో విరిసిన పారిజాతమో
కోడలుపిల్ల - నన్ను తాకి ఎవ్వరో
మల్లెపూవు - చిన్న మాట
మరో చరిత్ర - ఏ తీగ పూవునో
ముద్దమందారం - అలివేణీ ఆణిముత్యమా
ముత్యాల ముగ్గు - ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
నాలుగు స్తంభాలాట - చినుకులా రాలి
నాలుగు స్తంభాలాట - రాగమో అనురాగమో
నోము - కలిసే కళ్ళలోన
పదహారేళ్ళ వయసు - సిరిమల్లె పూవా
పంతులమ్మ - మానసవీణా మధుగీతం
పూజ - ఎన్నెన్నో జన్మల బంధం
పూజ - మల్లె తీగ వాడిపోగ
ప్రేమ సాగరం - చక్కనైన ఓ చిరుగాలి
ప్రేమాభిషేకం - తారలు దిగి వచ్చిన వేళ
రావణుడే రాముడైతే - కనులలో నీ రూపం
రావణుడే రాముడైతే - రవివర్మకే
రెండు జెళ్ళ సీత - కొబ్బరి నీళ్ళా జలకాలాడి
రెండు రెళ్ళు ఆరు - కాస్తందుకో
సొమ్మొకడిది సోకొకడిది - అబ్బో నేరేడు పళ్ళు
స్వప్న - ఇదే నా మొదటి ప్రేమలేఖ
శ్రీవారు మావారు - పూలు గుసగుసలాడేనని
శ్రీవారికి ప్రేమలేఖ - లిపి లేని కంటి బాస
తోట రాముడు - ఓ బంగరు రంగుల చిలకా

నా దగ్గర లేని పాటలు:

క్రింది పాటలు మీ దగ్గర ఉంటే దయచేసి నాకు ఒక ఈ-మెయిల్ పంపగలరా?

1. చిన్నికృష్ణుడు - జీవితం సప్తసాగర ద్వీపం
2. చిన్నికృష్ణుడు - మౌనమే ప్రియా ధ్యానమై
3. మూడు ముళ్ళు - లేత చలిగాలిలో
4. మూడు ముళ్ళు - నీ కోసం యవ్వనమంతా
5. రెండు జెళ్ళ సీత - మందారంలో ఘుమఘుమనై మకరందంలో మధురిమనై
6. బాబాయ్ అబ్బాయ్ - ఓ ప్రియా.. ఈ తొలిగాలులా ఒంటరి గాలులా
7. జమీందారుగారి అమ్మాయి - మ్రోగింది వీణ.. పదే పదే హృదయాలలోన
8. ప్రేమ సంకెళ్ళు - మెరుపులా మెరిసావు, వలపులా కురిసావు
9. తూర్పు వెళ్ళే రైలు - వేగుచుక్క పొడిచింది
10. పసుపు పారాణి - రేవులోన చిరుగాలి రెక్కలార్చుకొంటోంది
11. ప్రేమ తరంగాలు - మనసు ఒక మందారం
12. రాముడు కాదు కృష్ణుడు - చూసాక నిను చూసాక
13. నీడలేని ఆడది - తొలి వలపే తీయనిది
14. శ్రీదేవి - రాసాను ప్రేమలేఖలెన్నో
15. అందమైన అనుభవం - కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కి ఉన్నోళ్ళు

Friday, July 08, 2005

నువ్వు గుర్తొచ్చావు

ఇప్పుడే, మెరుపు మెరవగానే నువ్వు గుర్తొచ్చావు,
ఆపై, మేఘం ఉరమగానే నువ్వు గుర్తొచ్చావు,
వెనువెంటే వర్షం కురవగానే మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు;
నేను తడిసి ముద్దయ్యాను, అయినా నువ్వు గుర్తొచ్చావు...
ఎందుకు గుర్తుకు రావు మరి?
తీసుకున్న గొడుగు తిరిగి ఇస్తేగా నువ్వు...

(ఒక సరదా షాయరీకి తెలుగు అనువాదం)