గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Monday, April 17, 2006

వానకు తడిసిన పువ్వొకటి...

కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టు ఈ మధ్య నేనొక విషయాన్ని కనిపెట్టాను. ఏమిటంటే, కాస్తంత గ్యాప్ తర్వాత తిరిగి కవిత్వం చదువుతుంటే భలే బావుంటుందని. అలాగే పనిలో పనిగా ఇంకో విషయం కూడా కనిపెట్టాను. అదేంటంటే పాలపర్తి ఇంద్రాణి అనే ఆవిడ కవితలు రాస్తారని. రాస్తారంటే మామూలుగా కాదు - మనసుకు హత్తుకునే కవితలు... మనమే మనకోసమే రాసుకున్నామా అనిపించే కవితలు... అతి సాధారణంగా గడిచిపోయే రోజువారీ జీవితం లోపలి పొరల్లో దాగున్న అంతులేని కవిత్వాన్ని ఆవిష్కరించే కవితలు - మామూలు మాటల్లో అలవోకగా రాస్తారని.

ఒక వెబ్ సైటులో మొన్నొక కవిత చదివాను. రచయిత్రి పేరు పాలపర్తి ఇంద్రాణి అని ఉంది. ఆవిడ పేరు మీద నెట్లో వెదికితే మరి కొన్ని కవితలు దొరికాయి. ఆ మధ్య ఆవిడ కవితా సంకలనం "వానకు తడిసిన పువ్వొకటి" కి ఇస్మాయిల్ స్మారక అవార్డు కూడా వచ్చిందట. నేను సేకరించిన కవితలు పోస్టు చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయా పబ్లిషర్ల కాపీరైటు హక్కులు ఉల్లంఘించడం నా ఉద్దేశం కాదని మనవి. ఇవి చదివాక పుస్తకాన్ని కొని చదువుతారని ఆశిస్తున్నాను.

వానకు తడిసిన పువ్వొకటి

వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతుంది బావిలో
సుళ్ళుసుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ...
నవ్వుతూనే వుందది
తుళ్ళుతూనే వుందది
నీళ్ళమీద తేలుతూ వుంది..
పాతకొమ్మని
కొత్తనీళ్ళని
చూస్తూవుందది
మార్చి మార్చి

ఓ సాయంకాలం

ఒక్కో పువ్వు నీళ్ళల్లో రాలుతూ
ఒక్కో వలయాన్ని సృష్టిష్టోంది
జారిపడుతున్న పూలని
జరిగిపోతున్న వలయాలని
చూస్తూ చూస్తూ చూస్తూ
కాళ్ళు ఊపడం మర్చిపోయి కూర్చుండిపోతాను
టీ చల్లారి తరక కట్టిన సంగతే గమనించను

పిట్ట స్నానం

మిట్ట మధ్యాహ్నం వేళ
పిట్ట ఒకటి చక్కర్లు కొడుతోంది
నీటి దొన్నె పక్క వాలి
ఒక్కో కంటితో విస్మయపడుతోంది
ముక్కునటూ ఇటూ తాటిస్తూ
బుడుంగున తల ముంచుతోంది
రెక్కలల్లాడిస్తూ కిచ కిచమని
గాలి గుర్రం ఎక్కి పోతోంది

పిల్లలు నిద్దరోతున్నారు

రివ్వున కొట్టే శీతాకాలపు చలిగాలులు
తలుపు తట్టకుండానే వెనక్కు మళ్ళుతాయి
ఘుమ్మని వాసన జల్లే మల్లెమొగ్గలు
కిటికీలోంచి మెల్లిగా తొంగి చూస్తాయి
ఘల్లని కదిలే పెరటి చెట్ల ఆకులు
చప్పుడు చేయవద్దని గుసగుసలాడుతాయి
రైయ్యని ఎగిరే గాలిపటాలు
ముందు గదిలో నిశ్శబ్దంగా వేచి ఉంటాయి

వాగు

లోలోపల మట్టి మాట్టాడకుండా కూర్చుంటుంది
పైపైన వాగు గల గల గలా ప్రవహిస్తుంటుంది

లోలోపల బండరాళ్ళు నాచు పట్టి నిద్రపోతుంటాయి
పైపైన గడ్డిపోచలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి

లోలోపల చేపలు కుటుంబాలతో నివసిస్తుంటాయి
పైపైన తెప్పలు మనుషులతో తరలిపోతుంటాయి

లోలోపల నల్లని చీకటి అలుముకుని ప్రవహిస్తుంటుంది
పైపైన తైతక్కలాడే కాంతి కిరణాలతో వాగు నవ్వుతూ ఉంటుంది

మీరు

నీలిమబ్బుల మీదకెక్కి
ఈల వేస్తాను
గాలిరాగాలెన్నో కట్టి
తేలిపోతాను
వగరు బీరును తాగినట్టు
వూగిపోతాను -
ఆ రోజుల్లో ఆ వయసులో అప్పుడు
మీరు గుర్తొచ్చిన ప్రతిసారీ ఎప్పుడూ...

ప్రయాణం

విసురుగ వీచే గాలిలో
జోరుగ సాగే ఈ రైలు
వూపేస్తోంది నన్నేనా?
పుస్తకంలో మునిగిన
మిమ్మల్ని కూడానా?
అతిగా కాచే ఎండలో
గతి తప్పిన ఈ ఎడారి ఓడ
తీరని దాహం నాకేనా?
దిక్కులు చూస్తోన్న
మీకు కూడానా?