గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Saturday, August 28, 2004

రెండు కవితలు

నాకు నచ్చిన రెండు కవితలు పోస్ట్ చేస్తున్నాను. (అంటే నచ్చిన కవితలు ఇవి మాత్రమే అని కాదు. ) కాపీ రైట్లు ఆయా రచయిత(త్రు)లకు చెందుతాయి.

తలుపు - ఇస్మాయిల్

నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరుచుకుని
వెళ్ళిపోయావు నీవు

నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.

ఆకురాలు కాలం - మహెజబీన్

అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు

ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది

వద్దు...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు

అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ...

అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు

అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు వెంటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా అతన్ని నా గుండెలో దాచుకుంటాను

అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకు రాలే కాలానికి ఎక్కడ రాలి పడ్డాడో?

1 Comments:

Anonymous Anonymous said...

మనసుని తాకే కవిత.
ఈ సంకలనం చాన్నాళ్ళ క్రితం చదివాను మళ్ళి గుర్తు చేసినందుకు thanks .
మీకు కవితల పట్ల మంచి అభిరుచి ఉన్నట్టు కనిపిస్తుంది.

May 15, 2006 3:46 PM  

Post a Comment

<< Home