గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Saturday, September 04, 2004

అంపశయ్య

ఎందుకో గాని చాలా రోజుల తర్వాత లైబ్రరీకి వెళ్ళాలని కోరిక పుట్టింది. జనవరిలో వెళ్ళాననుకుంటా ఆఖరుగా. అనుకోవడమే తడవుగా ఆఫీసు నుండి బయటపడ్డాను. ఇంటికెళ్ళేసరికి సాయంత్రం ఆరున్నరయ్యింది. లైబ్రరీ 8 గంటల వరకు తెరిచుంటుందని గుర్తు. ఉండేది పక్క వీధిలోనే కాబట్టి అయిదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళాను. లైబ్రేరియన్ నన్ను చూడగానే గుర్తు పట్టింది. ఇన్ని రోజులు రాలేదేమని అడిగింది.
"ఆ మధ్య ఇండియాలో లేనండి", అన్నాను.
"ఓ… స్టేట్స్ వెళ్ళారా?", ఆవిడ కళ్ళలో, గొంతులో ఎక్స్పెక్టేషన్.
"లేదండి, యూరప్ వెళ్ళొచ్చాను".

ఆవిడ అంతగా ఇంప్రెస్ అయినట్లు లేదు. నా మెంబర్షిప్ రెన్యూ చెయించుకోవాలని చెప్పింది. రెన్యువల్ ఫీజు కట్టి బుక్స్ సెక్షన్ కి వెళ్ళాను.

ఏ పుస్తకం తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తుండగా నవీన్ "అంపశయ్య" కనిపించింది. అంపశయ్య చాలా మంచి ప్రయోగాత్మక నవల అని, క్లాసిక్ అని అక్కడా ఇక్కడా చదవడం తప్పించి ఇంతకు ముందెప్పుడూ ఆ నవల చదవలేదు. క్లాసిక్స్ అనేవి ఆర్టు సినిమాలలాంటివని, వాటి గురించి మాట్లాడ్డానికి తప్ప చదవడానికి పనికి రావని (ఆ మాటకొస్తే ఫలానా క్లాసిక్ గురించి మాట్లాడేవాళ్ళెవ్వరూ ఆ క్లాసిక్కుని చదివుండరని) మా సుజిత్ అంటుంటాడు. అయినా సరే ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. లైబ్రేరియన్ ఎంట్రీ రాసుకుంటూ, మీ పేరున్న పుస్తకమే తీసుకున్నారే అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేసి ఆ నవలతో ఇంటికొచ్చేసాను.

పుస్తకాలు చదవడమనే అలవాటు పోయి ఎన్ని ఏళ్ళయిందో ! ఎప్పుడో ఆర్నెల్ల కొకటీ అరా చదవడం తప్పించి చిన్నప్పుడు చదివినట్లు నన్ను నేను మరిచిపోయి ఒక మూల కూర్చుని ప్రపంచంతో సంబంధం లేకుండా పుస్తకం చదువుకోవడం ఎప్పుడో గాని వీలు పడడం లేదు. రెండేళ్ళ క్రితం మహెజబీన్ ఆకురాలు కాలం, అంతకు ముందెప్పుడో చలం మైదానం. పుస్తకం పట్టుకుంటే పూర్తిగా చదివాక గాని ఈ లోకానికి రాలేకపోవడం.. అదో భోగం, అదృష్టం. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చేలా అంపశయ్య చదివాను. నాలుగు గంటలపాటు వంచిన తల ఎత్తకుండా చదివి నవల ముగించాను. ఎంత సంతోషమేసిందో! పోగొట్టుకున్న విలువైన వస్తువేదో దొరికినట్టు.

చైతన్య స్రవంతి (stream of consciousness) అనే శైలిని ఉపయోగించి రాసిన నవల ఇది. చదవడం మొదలెట్టాక పూర్తి చేసేవరకు ఆపలేం. అమెరికా-వియత్నాం యుద్ధం గురించి, తెలంగాణా గురించి అప్పట్లో (1960లలో) విద్యార్థుల భావాలు ఎలా ఉండేవో, ఆర్థిక, సామాజిక, లైంగిక పరమైన సమస్యలు విద్యార్థుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయో చాలా సాధికారంగా వివరించాడు రచయిత. మొత్తానికి నేను కూడా ఒక క్లాసిక్ చదివేసాను :)

0 Comments:

Post a Comment

<< Home