గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Thursday, September 02, 2004

గొప్పవారు - మామూలు మనుషులు

నేను బ్లాగు కోసం రాసి రెండు వారాల పైనే అయిందంటే నాకేం ఆశ్చర్యంగా లేదు. కారణం - నేనంతే... చాలా సాధారణ జీవిని ( ఇంగ్లీషులో mere mortal అంటారే, అదన్నమాట). సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని వాడుకోవడం నా వల్ల కాని పని. అంటే రేపు పొద్దున 8 గంటలకు ఆఫీసుకు వెళ్ళాలంటే ఇవాళ రాత్రి కనీసం పదకొండింటికి పడుకుని ఉదయం కనీసం 7 గంటలకు నిద్ర లేచి అరగంటలో తయారై వెళ్ళాలనే చిన్నపాటి ప్లానింగు కూడా లేని బద్ధకపు పురుగుని. ఒకే సమయంలో మూడు, నాలుగు పనులు చెయ్యగలిగేంతటి టాలెంటు ఎటూ లేదు (ఉదా: హెడ్ ఫోన్లో హై వాల్యూం లో పాటలు వింటూ కంప్యూటర్ పై పని చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక చేత్తో స్టీరింగు పట్టుకుని ఇంకో చేత్తో స్టయిల్ గా మొబై ల్లో మాట్లాడడం లాంటివి - నేనైతే పని చేయడం మానేసి కేవలం పాటలు వినడమో, లేక డ్రైవింగు ఆపి ఫోనులో మాట్లాడ్డమో - ఏదో ఒక పనే చెయ్యగలను) .

మరి నాలాంటి వాడు బ్లాగు ఎందుకు మొదలెట్టాలి? మొదలెట్టగానే సరిపోతుందా? కనీసం అమావాస్యకో, పున్నమికో ఒకసారైనా అటువేపు చూడాలి కదా… ఏదో ఒకటి రాయాలి కదా…

కొంతమందిని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎంత చక్కగా తమను తాము మేనేజ్ చేసుకుంటారో!! ఉదయం నిద్ర లేచిందగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చెయ్యాలో ముందే నిర్ణయించుకుని దాని ప్రకారమే పనులు చేసుకుంటారు. ఎప్పుడు చదవాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు పాటలు వినాలో, ఎప్పుడు టివి చూడాలో, ఎప్పుడు పక్కింటి అమ్మాయికి సైటు కొట్టాలో అన్నీ ముందే తెలుసు వీళ్ళకు. మరి ఇదెలా సాధ్యం అని నాలాంటి పామరునికి సందేహం రావడం చాలా సహజం. ఎంచేతనంటే ఆకలి దప్పులు ప్రతి రోజూ ఒకే సమయానికి కలుగుతాయంటే సరే గాని కవితలు రాయడం, రొమాంటిగ్గా మాట్లాడ్డం లాంటి విషయాలు ప్లాను చేసుకోవడం ఎలా? అంటే ఇది అసాధ్యమని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే వారం విడిచి వారం సస్పెన్సు గుప్పిస్తూ సీరియల్సు రాసే రచయితలు, ప్రతి రోజూ లక్షల మంది ఆడవాళ్ళను ఏడిపించే టివి డైలీ సీరియల్ డైరక్టర్లు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

అంతెందుకు.. యండమూరి ఏదో పుస్తకంలో రాసాడు దాదాపు పదో, పదిహేనో సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఏదో ఒక పత్రిక కోసం కథో, సీరియల్ భాగమో రాసానని. డా మాలతీ చందూర్ గత 47 సంవత్సరాలుగా మొదట ఆంధ్రప్రభ వారపత్రికలో, ఇప్పుడు స్వాతి వారపత్రికలోను కాలమ్ నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా పాటల రచయితల సంగతి చూడండి. వేల కొద్దీ పాటలు అలవోకగా రాసేస్తారు. వేటూరి, సిరివెన్నెల ఎన్ని వందల అందమైన పాటలు రాసారు, ఇంకా రాస్తున్నారు! వారికది ఎలా సాధ్యమా అని ఎన్నిసార్లు అనుకుని ఉంటానో! ఇళయరాజా ఎన్నో పాటలకు నిముషాల్లో అందమైన ట్యూన్లు కట్టాడట. ఒక సినిమా రీరికార్డింగు మొత్తం ఒకే రోజులో చేసెయ్యగలడట! మరి ఆ మహానుభావుని సృజనను శంకించగలమా? (లెంపలేసుకుంటున్నాను). సృజనాత్మకమైన పనులు చేయడానికి స్పందించే మనసు అవసరం కదా, అంటే దానర్థం ఆ రచయితల, కళాకారుల మనసు ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుందనా? బహుశా అదే అయ్యుంటుంది. వేలమందిని స్పందింపజేసే సృజన వారికి దేవుడిచ్చిన వరం కాబోలు. అందుకే వారు గొప్పవారయ్యారు.

*** సశేషం ***

0 Comments:

Post a Comment

<< Home