కవితలు రాలుతున్నాయి
గుప్పెడు మల్లెలు ఎగరేస్తే
గంపెడు కవితలు రాలాయి
చారెడు కళ్ళదొకటి
తమలపాకు పెదాలదొకటి
పంచవన్నెల రాంచిలక
రివ్వురివ్వున ఎగిరొచ్చి
వాలిన కొమ్మ చివరన
ఎర్రని జాంపండుదొకటి
పడమటి గాలి తెమ్మెర
హాయిహాయిగా మోసుకొచ్చి
ఊరి నడుమన జారవిడిచిన
పరిమళాల లేఖదొకటి
ఎడారి కోయిలదొకటి
మంచుపూలదారిదొకటి
పురాతన గుహాంతర్భాగాల
నిశబ్ద శిలాచిత్రానిదొకటి
చుక్కలు రాలే రాత్రివేళ
అడుగు అడుగుకో కవిత ఏరి
కలువ కాడల దారమేసి
మాల గుచ్చి గంపనేస్తే
వెలుగుపువ్వులదొకటి మాత్రం
గాలిపటమై నింగికెగిరింది
విసుగు చెంది తెంచబోతే
పొద్దుపొడుపు వెనక దాగింది
(5/7/15 - మా పాప కోసం రాశాను. చదవడం మొదలెట్టే లోపు తను నిద్దరోయింది.)