ఎన్ ఈవినింగ్ ఎట్ బుద్ధ బార్
సాయంత్రమవుతుంది...
అన్ని గూళ్ళ పక్షులూ ఆ చోటికి చేరుతాయి
ఆలోచనల బరువును వాకిట్లో దించి
మసక దీపాల వెనక క్రీనీడల్లో బిడియపు వలువలు
అసంకల్పితంగా విడిచిపెడతాయి
ఒక మంద్రస్వరపు గానానికి గాలి రాగరంజితమవుతుంది
మైకపు తెరల నడుమ గోడలపై ఛాయలు అలుక్కుంటాయి
అయస్కాంతపు చూపుల మధ్య కాలం ఉనికిని కోల్పోతుంది
సామీప్యపు వాసనలో ఒంటరి ఊహలు కాలిపోతాయి
గాజు నవ్వులన్నీ చీకటి ప్రవాహంలో చలిస్తాయి
వెచ్చటి ఊపిరి రహస్య స్నేహితుడిలా గుసగుసలాడుతుంది
బరువెక్కిన గుండె తడి కాస్త పంచుకుంటుంది
లేశన్మాత్రపు ఆర్ద్రతకు అనంతాశ్రువులు ప్రవహిస్తాయి
ఏ జాములోనో అప్రయత్నంగా ఏ గూటి పక్షులా గూటికి చేరుకుంటాయి
ఉత్తుంగ తరంగాలు అంతరంగాన డోలాయమానమవు వేళ
చీకటి దుప్పటి కప్పుకుని చిక్కటి స్వప్నంలో అందరూ ఒకటవుతారు
ఆ ప్రశాంతత ప్రపంచానికక్కర్లేదన్నట్టు అప్పుడే భళ్ళున తెల్లారుతుంది
Pic courtesy: http://www.orlikgallery.com/
1 Comments:
aavedanani ardhavanthamga vrasaaru.,pisaranthaina magavari aalochanalo maarpu ravalani aasiddham
Post a Comment
<< Home