గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Sunday, March 08, 2015

నో కంట్రీ ఫర్ వుమెన్

ఈ శతాబ్దపు నవయువ సోదరా
మనకో మంచి అవకాశం
ఆడాళ్ళకు ప్రత్యేకమైన ఈ రోజుని
అలవాటుగా కబళిద్దాం

ఒక్క ఉదుటున బయల్దేరు
ఇంకా ఎందుకు ఆలస్యం 
తోడుగా మన సంస్కృతిని 
వెంటతేవడం మరిచిపోకేం

సంప్రదాయమూ చట్టుబండలని
భావదారిద్ర్యంలో మునిగితేలుదాం  
వేదాల్లో అన్నీ ఉన్నాయిష 
సొంత మెదడును పాతరేద్దాం

పురాణాల్లో పతివ్రతలు
ఇప్పటికీ మనకు రెఫరెన్సు
అహల్యా, అనసూయా ఎవరైతేనేం
చేస్టిటీ అనేది మగాడు రాసిన సిలబస్సు

నోరు దురదగా ఉందోయ్ 
మంచి వేదికొకటి చూడు
కూతుర్లను కాపాడి చదవేస్తామని
రికామీగా నాలుగు మాటలు చెపుదాం

మీరు, మేము సమానమని
ఆకాశంలో సగం మీదని
వారి పాటా మనమే పాడాలి
మసిపూసి మారేడుకాయ చేయాలి

పూలూ, రాళ్ళతో వీరిని జమకట్టే
మన మేధావి మిత్రులుండగా
లడ్కే లేంగే ఆజాదీ అని
గొంతు చించుకోవడం దండగ

ఇంకా అర్థమవని వారికోసం
ఈ రెండు ముక్కలు తిరగరాశా
దేశమంటే మట్టి కాదోయ్ 
దేశమంటే మగాళ్ళోయ్