గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Monday, July 16, 2012

అటక మీది పెట్టె


నిన్ను మరిచిపోవాలని
గట్టిగా నిర్ణయించుకున్నాక
అటక మీది పెట్టెను కిందకు దింపాను
నీ గుర్తులన్నీ మూటగట్టి అందులో వేయాలని
నీ గురించి రాసిన ఈ ఆఖరి కవితను కూడా...

ఓసారి తొంగి చూసాను...
రెండో తరగతి తెలుగు పుస్తకం
ఎప్పటిదో గాలిపటం
పగిలిన గోళీలు, ఎరుపు రంగు చాక్లెట్ పేపరు
రైలుచక్రం కింద సొట్టబడ్డ పావలా

అట్టడుగున దొరికింది
ఎప్పటిదో నా డైరీ
తెరిచి చూసానా...ఆశ్చర్యం!
ఈ కవిత అందులోనిదే!

కలల ప్రయాణం 

కోటి విస్ఫోటాల కదనరంగం
రెప్పపాటున ఎగసి ఎగసి  
నింగిలోకి చుక్కలు చిమ్మే దృశ్యం
అంతలోనే రాలి పరుచుకునే 
మంచు పూల మైదానం 

ఘనీభవించేది నీరో నెత్తురో
దిగంతాన కాంతో అనంతమో
తరుముతున్నది ఊపిరో ఉప్పెనో
కాలుతున్నది స్వేదమో దేహమో

రంగుల కల కరిగేలోపు 
రయ్యని ఊహల పడవలో షికారు చేయనివ్వు
ఎరుపు, పచ్చ, నీలపు అలలు అటుఇటు అవుతూ
అలుక్కుని నలుపూ తెలుపుల లోతుల్లోకి
ఎడతెగని ప్రవాహాన్నై అంతలో స్థాణువునై 

అగరు పొగల తెరను తీసి
మెరుపుల వంతెన దాటి
చేరిన ఆఖరి మజిలీలో 
స్వప్నరాగస్మితవై నువ్వు

ఆ కాస్త దూరం కరిగి
నిన్ను కావిలించుకునే సరికి 
దయలేని తొలి కిరణం 
ఎదలో ముల్లై గుచ్చి లేపుతుంది