గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Tuesday, May 25, 2010

యూనివర్సిటీ

ఆ క్యాంటీన్ బయట రాతి చప్టా మీద
కాలు మీద కాలేసుకుని చాయ్ తాగుతూ
అప్పట్లో మరి నేనూ అనుకునేవాడిని
ఇకనుంచి నా రాజ్యం మొదలవుతుందని

ఓరచూపుల పరిచయాలు, కోరనవ్వుల బెదిరింపులు,
రాయల్ సెల్యూట్లు, అర్ధరాత్రి పరేడ్లు,
కలిసి చేసుకున్న పార్టీలో
గాలికెగిరిపోయిన బిడియాలు... అన్నీ గుర్తే
ఆ గుల్‌మొహర్ చెట్ల కింద ఆ రోజు
పువ్వులేరుకుంటూ ఎంత దూరం నడిచామో మాత్రం గుర్తు లేదు

ఆ కనబడే పొగడ చెట్ల కవతల
హాస్టలు గోడల వెనుక అంతఃపురంలో ఉండే
యువరాణి తుమ్మెద రెక్కల కనురెప్పలు
కొట్టుకున్నప్పుడల్లా ఇక్కడ గుండె లయ తప్పేది

ఎగరగొట్టిన క్లాసుల జాబితా
చందమామను తాకేంత పొడవున్నా
చిరంజీవినీ, ఆమిర్ ఖాన్నూ
మొదటి రోజే కలుసుకునేవాళ్ళం కదా

ఒక చిన్న ఆవేశం, కొన్ని భగ్నప్రేమలు
నాలుగు బీర్ల చీర్సులో కొట్టుకుపోయేవి
ఒక గదిలో మొదలైన పాటకు
వంద చేతులు తాళం వేసేవి

అప్పుడెప్పుడూ అనిపించలేదిలా
ఈ తెల్లవారుజాము నాస్టాల్జియా
తెరలు తెరలుగా సంగతులు గుర్తొస్తుంటే
మరొక్కసారి పయనించాను యూనివర్సిటీ రోడ్డు మీద..

వసంతం

నిన్నొదిలి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది
కాలాన్ని గదిలో పెట్టి తాళం వేయాలని
కానీ ఎందుకో మరి ఆగిపోతాను
దిగంతపు అంచులకు ప్రయాణం తప్పదు

వేయి యుగాల ప్రయాణం తర్వాత
చేరవలసిన చోటొస్తుంది
అక్కడికెళ్ళాకగానీ నాకర్థం కాదు
నా వునికిని నీ దగ్గర వదిలి వచ్చానని

అనంత దూరాలకావల వేచి వుంటాను
నిన్ను తిరిగి కలిసే క్షణం కోసం
ఎన్నో శిశిరాల తర్వాత
ఎదురొచ్చే ఒక్క వసంతం కోసం

Saturday, May 15, 2010

ఇంద్రధనుస్సు

మెరుపుల వలలో చిక్కిన మేఘం
మోసుకొచ్చిన కబురు కరిగి నీరవుతుంది
వేచి వేసారిన వేడి నిట్టూర్పుల నేల
తనివిదీరా తడిసి ముద్దవుతుంది

విచ్చుకున్న వేల ఊహలు
కాగితపు పడవలుగా మారిపోతాయి
రెక్కలొచ్చిన కోటి ఆశలు
ఆకాశం అంచుకు చేరుతాయి

రాలిపడ్డ మంచు పూలు
దోసిట్లో ముత్యాలవుతాయి
నీ కళ్ళ మాటున చిరునవ్వు
ఇంద్రధనుస్సు సంతకమవుతుంది