గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Tuesday, October 23, 2007

నువ్వు లేనప్పుడు...

నువ్వున్నప్పుడు...
టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ
నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి
నీ మీద వెధవ జోకులేస్తూ మేధావిలా ఫోజెట్టి
కిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి
ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...

నువ్వు దగ్గర లేనప్పుడు...
రేడియోలో రఫీ పాటలు వింటూ
తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని
నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ
గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ
స్థాణువునై పడున్నాను

Sunday, October 21, 2007

ఒక పాత ఉత్తరం...

2nd Feb 2004
9:25 pm
Hotel room

చెట్లు గాలికి మంత్రముగ్ధంగా తలూపడం అనేది యండమూరి నవల్లో చదవడం తప్ప నేరుగా అనుభవించి చాలా రోజులైంది. ఇదిగో ఈ రాత్రి మళ్ళీ చూస్తున్నాను. చుట్టూ చీకటి. గదిలో లైట్లన్నీ ఆర్పేసి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూస్తున్నాను. చీకట్లో కూర్చుని దూరాన కనిపించే మిణుకు మిణుకు వెలుతురు చూడడం భలే బాగుంది.

రేపు జర్మనీలో నేను గడపబోయే ఆఖరి రోజు. అంటే రెండు వారాల తర్వాత మళ్ళీ వస్తాననుకో. నా మొదటి ట్రిప్ కి రేపు ఆఖరి రోజన్నమాట. వచ్చినప్పట్నుంచి అనుకుంటూనే ఉన్నాను. జర్మనీ అనుభవాల గురించి రాయాలని. యథాప్రకారం బద్ధకం వల్లా, టైం లేకపోడం వల్లా (ఛా!) ఇంతవరకు ఎం రాయలేదు. సరే, better late than never అనుకుని ఇదిగో తోచిందీ, గుర్తుకొచ్చిందీ రాసేస్తున్నాను.

ఇందాక రెస్టారెంట్లో తిన్న ఇటాలియన్ వంటకం (అదేదో నోరు తిరగని పేరు) తాలూకు సువాసన ఇంకా చేతిని వదల్లేదు. భోంచేసాక ఆరుబయట అలా నడిచి వద్దామనుకున్నాను గాని చలికి తోడు గాలి వీస్తుండడంతో ఆ ఆలోచన మాని గదికొచ్చేసాను. గదిలోకొచ్చి తలుపేసి కదలకుండా అలాగే కాసేపు నిలబడ్డాను. ఎందుకో చీకట్లో కూర్చోవాలనిపించింది. లైట్లన్నీ ఆర్పేసి కిటికీ దగ్గరకొచ్చాను.

గాలికి మంత్రముగ్ధంగా చెట్లు తలూపుతున్నై (నిజంగానే). ఏం చెట్లో ఏమో. రేపు ఎవర్నైనా అడగాలి. జర్మనీలో ఎక్కడ చూసినా కనపడతై. నిన్న మొన్నటి దాకా మంచులో తడిసి ముడుక్కున్నవల్లా ఈ రోజు స్వేచ్ఛగా అటూ ఇటూ ఊగుతూ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. చెట్ల చిటారు కొమ్మల వెనుక క్షితిజరేఖ తాలూకు పలుచని కాంతి అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. చూట్టానికి చెట్లు - మొదల్లు లేకుండా - గాల్లో నిలబడినట్లు అనుభూతి కలుగుతోంది. చిత్రకారులు, కవులు ఇలాంటి దృశ్యాల ప్రేరణతోనే పుడతారనుకుంటా.

పోయిన వారం చూసుండాలి. ఎక్కడ చూసినా మంచు. ఎటు చూసినా తెలుపే. It looked as though the world has been painted white. మంచు మైదానాలు, మంచు తిన్నెలు, మంచు వాకిల్లు, మంచు పొదరిండ్లూ, మంచు పూలూ... ఒకటని కాదు. అన్నీ మంచు ముసుగు కప్పేసుకున్నాయి. నువ్వన్నావు చూడు రంగులన్నీ కలిసిపోయినట్టు, తెలుపు తప్ప ఇంకేదీ లేనట్టు... నాకు అన్నిటికన్నా నచ్చింది మాత్రం మంచులో తడిసిన చెట్లు. ఎంత బావుంటాయో. ఆ ఇంకానేమో ఆల్ప్స్ పర్వతాలు. ఫ్లైట్లోంచి చూసాను. గుండె లయ తప్పిందంటే నమ్ము. మిలన్ నుంచి మ్యూనిక్ వచ్చానా... బుల్లి ఫ్లైట్.. ఈడ్చి కొడితే 30 మంది ప్రయాణికులు. మగత నిద్రలో కాసేపు తూగి ఎందుకో కిటికీలోంచి చూసానా... మతి పోయే దృశ్యం. కనుచూపు మేరా వ్యాపించిన మంచు కొండల సముదాయం. ఫ్లైట్ అప్పుడప్పుడూ ఏటవాలుగా వాలుతుంది చూడు.. అప్పుడు చూడాలి.. అద్భుతమైన వ్యూ! మంచు కొండలూ, వాటి మధ్యలో నల్లటి సరస్సులూ... ఆకాశంలో రంగు రంగుల చిత్రాలు గీస్తూ సూర్యుని కిరణాలూ. ఒక్క నిమిషం కూడా కనురెప్ప వేయకుండా చూసాను. మళ్ళీ చూస్తానో లేదో అని. ఫోటోలు కూడా తీసాను. ఎలా వస్తాయో ఏమో.

హైదరాబాదు నుండి మిలన్ వరకు ప్రయాణం ఎంత బోర్ కొట్టిందో మిలన్ నుంచి మ్యూనిక్ వరకు అంత సరదాగా సాగింది. మిలన్ ఎయిర్పోర్టులో మూడున్నర గంటలు వెయిటింగ్ టైం. పొద్దుటే ఆరుకి దిగాను మిలన్లో. మ్యూనిక్ కి వెళ్ళే టెర్మినల్లో ఎవరూ లేరు ఆ టైంలో. మూడు గంటలు టైం పాస్ చెయ్యడానికి మిలన్లో హింది సినిమాలు ఉండవు కదా, ఎలారా బాబూ అనుకుంటూ ఉంటే ఒక మూల ఒకతను కనిపించాడు. చూడబోతే ఇండియన్ లా ఉన్నాడు. మిలన్లో ఫోటో తీసుకున్నట్లు ఉంటుంది కదా అని అతనికి కెమెరా ఇచ్చి ఒక ఫొటో తీయమన్నాను. ఫోటో తీసాక పరిచయం చేసుకున్నాను. గోవా నుంచి వస్తున్నాడంట. ఇటలీలో జెనోవా కి వెళ్తాడంట. ఏడు సంవత్సరాలనుంచి ఇటలీలోనే ఉంటున్నానని చెప్పాడు. బాగా మాటకారిలా ఉన్నాడు (నా కంటే.. ;-) కేటరింగ్ పని చేస్తున్నాడంట. ఇటలీలో ఇండియన్లు చాలామంది అక్కడి ఇళ్ళలో పని చేస్తారని, కేటరింగ్ జాబ్ దొరకాలంటే చాలా కష్టపడాలని చెప్పాడు. ఇంకానేమో తనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆమె గురించి కాసేపు ఏదో చెప్పాడు.

ఇంతలోపల చుడీదార్లో ఉన్న ఒక గోరీ మేం వచ్చి పలకరించింది. "చూట్టానికి ఇండియన్లలా ఉన్నారు. కాస్త సాయం చెస్తారా? ముంబైలో ఉండే నా స్నేహితురాలికి ఫోన్ చేద్దామంటే లైన్ దొరకట్లేదు. లైన్ సమస్యో లేక ఈ కాలింగ్ కార్డు పని చెయ్యట్లేదో అర్థం కావట్లేదు...". సరే పదమని తనతో వెళ్ళి కాసేపు ప్రయత్నించాను. హైదరాబాదుకి దొరుకుతోంది గాని ముంబై కి లైన్ దొరకట్లేదు. తను కూడా చాలా సేఫు ప్రయత్నించి విసుగొచ్చి ఆపేసింది. సరేనని ఇక మాటలు మొదలెట్టాం. తన పేరు మారియోన్ అని చెప్పింది. మ్యూనిక్ తన సొంత ఊరంట. జర్మన్, ఇంగ్లీషు భాషలు చెప్తుందంట ఏదో స్కూల్లోనో, కాలేజిలోనో. ఐదు వారాలు సెలవు మీద ఇండియా చూడాలని వచ్చిందంట. అందులో ఒక వారం ఎవరో గురూజీ గారి సేవ కోసమంట! ఇండియాకి రావడం అది రెండో సారంట. ఇండియా అంటే చాలా ఇష్టమంట. ఒక గంట సేపు మాట్లాడాం. ఇంతలో గోవా అతను కస్మెరో రోడ్రిగెజ్ కూడా వచ్చి కలిసాడు. చాలాసేపు మాట్లాడి ఒకరి కాంటాక్ట్ డీటెయిల్సు మరొకరికి ఇచ్చుకున్నాం. ముగ్గురం కలిసి ఫోటో దిగాలని డిసైడ్ అయ్యాం. ఎవరినడగాలా అనుకుంటూ ఉంటే పక్కనే ఒకతను కనిపించాడు.

డేవ్ అని అమెరికన్. ఇమ్యునాలజీలో Ph.D. చేస్తున్నాట్ట బెర్లిన్ లో. మా ముగ్గురి ఫోటో తీసాడు. తరవాత డేవ్ తో కబుర్లు. యూరోపియన్లకు, అమెరికన్లకు మధ్య తేడా కాస్తో కూస్తో కనపడింది మారియోన్, డేవ్ ల మధ్య. మారియోన్ ఐదు వారాలు సెలవు పెట్టి ఇండియా వెళ్ళొచ్చిందని తెలియగానే ఆమె మీద జోకులేసాడు. మీ జర్మన్లు మరీ విచిత్రం. మరండీ, మేము ఇరవై ఎనిమిది వారాలు సెలవు మీద వెళ్ళొచ్చామండి అంటే ఎలా ఉంటుందేంటి అని విరగబడి నవ్వాడు. He has an extra funnybone I guess. ముగ్గురం బాగా కలిసిపోయాం. టైం తెలియకుండా మాట్లాడుకున్నాం. మారియోన్, నేను ఒకే ఫ్లైట్లో మ్యూనిక్ కి వెళ్ళాలి. డేవ్ బెర్లిన్ కి వెళ్తుండగా, కస్మెరొ జెనోవాకి వెళ్తున్నాడు. డేవ్, కస్మెరో మాకంటే ముందుగా, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. మారియోన్, డేవ్, నేను కలిసి ఒక ఫోటో దిగాము డేవ్ వెళ్ళిపోయేముందు.

ఫ్రీజింగ్ అంటే ఏంటో మిలన్లో అనుభవానికొచ్చింది నాకు మొదటి సారి. గ్లోవ్సు, వులన్ క్యాపు..ప్చ్, ఏమీ లాభం లేదు. మారియోన్ కైతే అవి కూడా లేవు. పాపం ఇండియా హేంగోవర్లో ఉందేమో... చెప్పులేసుకుని వచ్చింది. కాసేపట్లో సన్నగా వణకడం మొదలెట్టింది. పాత హిందీ సినిమాలో శశి కపూర్లా నా జాకెట్ ఆఫర్ చేద్దామనుకున్నాను గాని ఏడిసినట్లుంటుందని ఆ పని చెయ్యలేదు. ఫ్లైట్లోకి ఎక్కాక మారియోన్ పరిస్థితి మెరుగయింది. ఆల్ప్స్ మీద ప్రయాణం మరిచిపోలేని అనుభూతి. మ్యూనిక్ ఎయిర్పోర్టులో మారియోన్ వాళ్ళ అమ్మానాన్నా వచ్చారు ఆమెను రిసీవ్ చేసుకోడానికి. వీలున్నప్పుడు తనకు ఫోన్ చెయ్యమని చెప్పి మరియోన్ వెళ్ళిపోయింది. నేను ఎయిర్పోర్టు బయటికొచ్చి ఒక ట్యాక్సీని మాట్లాడుకుని నేరుగా ఆఫీసుకి వెళ్ళిపోయాను. ఆఫీసులో ఎదురైన అనుభవం... it was a different story altogether. ఇంకోసారి రాస్తా వీలైతే. ప్రస్తుతానికి ఇంతే సంగతులు, చిత్తగించవలెను.