గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Saturday, September 25, 2004

జుగల్ బందీ

ఒకప్పటి "తెలుసా" లిస్టు తిరగేస్తుంటే ఈ అందమైన కవిత దొరికింది. జెండర్ ఇనీక్వాలిటీ మీద ఇంత అందంగా, అర్థవంతంగా కవిత్వం రాయడమంటే... కచ్చితంగా రచయిత్రి చాలా ప్రతిభావంతురాలు. నిర్మలగారు రాసిన మిగతా కవితల్ని అర్జెంటుగా సంపాదించాలి.

జుగల్‌ బందీ (ఘంటసాల నిర్మల)
రాత్రి దీపం రహిస్తుంది
మసక చీకటి మంత్రభస్మమై కలల పొగలు పొటమరిస్తాయి
ఏకంతధ్వాంతాన మొహమాటాల మొగ్గలు విప్పారి
స్వాగత సౌరభాలు ఎరుపుకొసల అగరుతీగలౌతాయి
పగలంతా సమస్యల పచ్చి గాయాలు రేగి దిగులు స్రవించిన కళ్ళు
నిశాలేపనం పులుముకుని లేవెన్నెల బయళ్ళవుతాయి
దైనిక మర్యాదల నిర్జల ధారలలో
తడిసి మోపెడైన సభ్యతావస్త్రాలు విదిల్చి
వాంఛాస్నానానికి ఉద్యమించి
ఆత్మలు రెండు
నిలువెత్తు నిస్సిగ్గుకి నిర్వచనభంగిమలౌతాయి
.............
దేహం మహతిపై స్పర్శాపవనాలు తరగలెత్తి
మగత నవ్వుల నిక్వాణాలతో మోహం మేఘమల్హారమౌతుంది
చీకటి నదిలో అనాది కాంక్షాకిరణం సోకి
విప్పారిన ఇరుకల్హారాలు పరవశాల పరిమళాలు పైకెగరేస్తాయి
వాంఛోధృతికి వణికిపడే ఒళ్ళూ
రహస్యాల్ని వడికే వేళ్ళూ
ఎప్పటికీ తెగని చిక్కుముడిని విప్పేందుకు పలకాబలపాలవుతాయి
ఊరువులూ నిట్టూరుపులూ
మానసాన్ని మాధుర్యమండలానికి మోసుకెళ్ళే పూలతాళ్ళవుతాయి
పరస్పర గాత్రసహకారంతో
జుగల్‌ బందీ తారాస్థాయిని చేరుతుంది
నెత్తురంతా నిషా పొంగి
అగాధ రహస్యాలు చెరిసగమై ఆవిష్కరించాక
చెమరించిన నొసట తృప్తి వజ్రం తళుకుమంటుంది
..........
డోలిక ఆగక తప్పదు
ఇంతా జరిగి పోయాక హాయి వూయల ఆగక తప్పదు
చాలీ చాలని సుఖం దుప్పటి బాహ్యాంతర నగ్నతను పూర్తిగా కప్పదు
హఠాత్తుగా పూచిన పరిమళాలు అంతలోనే ఆవిరవుతాయి
ఒడుపు తెలీక చేజార్చిన కలల పట్టు దారాల కోసం
కళ్ళు వెక్కిళ్ళు పెడతాయి
రూపాల్నీ లోపాలనీ సుతారం చేసి చూపిన
వెన్నెల వెండి అద్దం వెల వెల పోతుంది
యదార్థాల యాంటీక్లయిమాక్సు ఎప్పటిలా ఎదురొస్తుంది
సమస్యలు రేగిన వ్రణాల్లా సలపరిస్తాయి
నిజాలు నిప్పుకణాల్లాగే నిగారిస్తాయి
ప్రశ్నల పునర్జ్వలనంతో అంతరాత్మల కమురుకంపుకు
అగరు కొసన వేలాడే బూడిద తీగ ఆఖరి ప్రేక్షక నేత్రమౌతుంది
క్షణం క్రితం గర్వపడ్డ హృదయం గాయమై పగులుతుంది
మాధుర్య మాణిక్యమై భాసించింది మట్టిముద్దయి మిగులుతుంది
నల్లని చల్లని రాత్రి గచ్చు మీద
తొలికిరణం తురాయి ముల్లయి గుచ్చుతుంది

Wednesday, September 15, 2004

బాబోయ్ జావా !

శేషుకి థాంక్స్ చెప్పాలి ఈ లింకు పంపినందుకు :) మీరు కూడా జావా బాధితులా? అయినా, కాకపోయినా, సరదాకి ఈ లింకు చూడండి. హాయిగా నవ్వుకోండి :))
గ్రిడ్ బ్యాగ్ మహత్యం

Saturday, September 11, 2004

పుస్తకం మంచి మిత్రుడి వంటిది

ట కదా అని రోజుకో పుస్తకం చదువుతున్నాను ఈ మధ్య. ఈ వారం చదివిన పుస్తకాలు:
ఆసమర్థుని జీవయాత్ర (గోపీచంద్)
సింపుల్ గా చెప్పాలంటే ఈ నవల అద్భుతం. వివరంగా చెప్పడం నావంటి సామాన్యుడికి సాధ్యమయ్యే పని కాదు.

ప్రేమోపహతులు (గోపీచంద్)

కలకంఠి (రావిశాస్త్రి కథలు )

రెండు గుండెల చప్పుడు (యండమూరి)

ఇంకాస్త టైం దొరికినప్పుడు ఒక్కో పుస్తకం గురించి మరింత వివరంగా రాస్తాను.

Friday, September 10, 2004

క్యాచ్-22

క్యాచ్-22 గురించి వినడమే గాని ఎప్పుడూ చదవలేదు. సరే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తే ఇది దొరికింది.
క్యాచ్-22 అంటే ఏంటి?

అంటే పెళ్ళైన బ్రహ్మచారే పెళ్ళికి అర్హుడు అనడం లాంటిదన్నమాట క్యాచ్-22 :)

Saturday, September 04, 2004

అంపశయ్య

ఎందుకో గాని చాలా రోజుల తర్వాత లైబ్రరీకి వెళ్ళాలని కోరిక పుట్టింది. జనవరిలో వెళ్ళాననుకుంటా ఆఖరుగా. అనుకోవడమే తడవుగా ఆఫీసు నుండి బయటపడ్డాను. ఇంటికెళ్ళేసరికి సాయంత్రం ఆరున్నరయ్యింది. లైబ్రరీ 8 గంటల వరకు తెరిచుంటుందని గుర్తు. ఉండేది పక్క వీధిలోనే కాబట్టి అయిదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళాను. లైబ్రేరియన్ నన్ను చూడగానే గుర్తు పట్టింది. ఇన్ని రోజులు రాలేదేమని అడిగింది.
"ఆ మధ్య ఇండియాలో లేనండి", అన్నాను.
"ఓ… స్టేట్స్ వెళ్ళారా?", ఆవిడ కళ్ళలో, గొంతులో ఎక్స్పెక్టేషన్.
"లేదండి, యూరప్ వెళ్ళొచ్చాను".

ఆవిడ అంతగా ఇంప్రెస్ అయినట్లు లేదు. నా మెంబర్షిప్ రెన్యూ చెయించుకోవాలని చెప్పింది. రెన్యువల్ ఫీజు కట్టి బుక్స్ సెక్షన్ కి వెళ్ళాను.

ఏ పుస్తకం తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తుండగా నవీన్ "అంపశయ్య" కనిపించింది. అంపశయ్య చాలా మంచి ప్రయోగాత్మక నవల అని, క్లాసిక్ అని అక్కడా ఇక్కడా చదవడం తప్పించి ఇంతకు ముందెప్పుడూ ఆ నవల చదవలేదు. క్లాసిక్స్ అనేవి ఆర్టు సినిమాలలాంటివని, వాటి గురించి మాట్లాడ్డానికి తప్ప చదవడానికి పనికి రావని (ఆ మాటకొస్తే ఫలానా క్లాసిక్ గురించి మాట్లాడేవాళ్ళెవ్వరూ ఆ క్లాసిక్కుని చదివుండరని) మా సుజిత్ అంటుంటాడు. అయినా సరే ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. లైబ్రేరియన్ ఎంట్రీ రాసుకుంటూ, మీ పేరున్న పుస్తకమే తీసుకున్నారే అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేసి ఆ నవలతో ఇంటికొచ్చేసాను.

పుస్తకాలు చదవడమనే అలవాటు పోయి ఎన్ని ఏళ్ళయిందో ! ఎప్పుడో ఆర్నెల్ల కొకటీ అరా చదవడం తప్పించి చిన్నప్పుడు చదివినట్లు నన్ను నేను మరిచిపోయి ఒక మూల కూర్చుని ప్రపంచంతో సంబంధం లేకుండా పుస్తకం చదువుకోవడం ఎప్పుడో గాని వీలు పడడం లేదు. రెండేళ్ళ క్రితం మహెజబీన్ ఆకురాలు కాలం, అంతకు ముందెప్పుడో చలం మైదానం. పుస్తకం పట్టుకుంటే పూర్తిగా చదివాక గాని ఈ లోకానికి రాలేకపోవడం.. అదో భోగం, అదృష్టం. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చేలా అంపశయ్య చదివాను. నాలుగు గంటలపాటు వంచిన తల ఎత్తకుండా చదివి నవల ముగించాను. ఎంత సంతోషమేసిందో! పోగొట్టుకున్న విలువైన వస్తువేదో దొరికినట్టు.

చైతన్య స్రవంతి (stream of consciousness) అనే శైలిని ఉపయోగించి రాసిన నవల ఇది. చదవడం మొదలెట్టాక పూర్తి చేసేవరకు ఆపలేం. అమెరికా-వియత్నాం యుద్ధం గురించి, తెలంగాణా గురించి అప్పట్లో (1960లలో) విద్యార్థుల భావాలు ఎలా ఉండేవో, ఆర్థిక, సామాజిక, లైంగిక పరమైన సమస్యలు విద్యార్థుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయో చాలా సాధికారంగా వివరించాడు రచయిత. మొత్తానికి నేను కూడా ఒక క్లాసిక్ చదివేసాను :)

Friday, September 03, 2004

చిట్టి కవిత


ఇది నాకు బాగా నచ్చిన చిరు కవిత. ఎవరు రాసారన్న విషయం స్పష్టంగా తెలియదు. నాగభైరవ అని ఒక అభిప్రాయం.

నా దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది
ఇంకా తెలవారలేదు.

Thursday, September 02, 2004

గొప్పవారు - మామూలు మనుషులు

నేను బ్లాగు కోసం రాసి రెండు వారాల పైనే అయిందంటే నాకేం ఆశ్చర్యంగా లేదు. కారణం - నేనంతే... చాలా సాధారణ జీవిని ( ఇంగ్లీషులో mere mortal అంటారే, అదన్నమాట). సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని వాడుకోవడం నా వల్ల కాని పని. అంటే రేపు పొద్దున 8 గంటలకు ఆఫీసుకు వెళ్ళాలంటే ఇవాళ రాత్రి కనీసం పదకొండింటికి పడుకుని ఉదయం కనీసం 7 గంటలకు నిద్ర లేచి అరగంటలో తయారై వెళ్ళాలనే చిన్నపాటి ప్లానింగు కూడా లేని బద్ధకపు పురుగుని. ఒకే సమయంలో మూడు, నాలుగు పనులు చెయ్యగలిగేంతటి టాలెంటు ఎటూ లేదు (ఉదా: హెడ్ ఫోన్లో హై వాల్యూం లో పాటలు వింటూ కంప్యూటర్ పై పని చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక చేత్తో స్టీరింగు పట్టుకుని ఇంకో చేత్తో స్టయిల్ గా మొబై ల్లో మాట్లాడడం లాంటివి - నేనైతే పని చేయడం మానేసి కేవలం పాటలు వినడమో, లేక డ్రైవింగు ఆపి ఫోనులో మాట్లాడ్డమో - ఏదో ఒక పనే చెయ్యగలను) .

మరి నాలాంటి వాడు బ్లాగు ఎందుకు మొదలెట్టాలి? మొదలెట్టగానే సరిపోతుందా? కనీసం అమావాస్యకో, పున్నమికో ఒకసారైనా అటువేపు చూడాలి కదా… ఏదో ఒకటి రాయాలి కదా…

కొంతమందిని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎంత చక్కగా తమను తాము మేనేజ్ చేసుకుంటారో!! ఉదయం నిద్ర లేచిందగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చెయ్యాలో ముందే నిర్ణయించుకుని దాని ప్రకారమే పనులు చేసుకుంటారు. ఎప్పుడు చదవాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు పాటలు వినాలో, ఎప్పుడు టివి చూడాలో, ఎప్పుడు పక్కింటి అమ్మాయికి సైటు కొట్టాలో అన్నీ ముందే తెలుసు వీళ్ళకు. మరి ఇదెలా సాధ్యం అని నాలాంటి పామరునికి సందేహం రావడం చాలా సహజం. ఎంచేతనంటే ఆకలి దప్పులు ప్రతి రోజూ ఒకే సమయానికి కలుగుతాయంటే సరే గాని కవితలు రాయడం, రొమాంటిగ్గా మాట్లాడ్డం లాంటి విషయాలు ప్లాను చేసుకోవడం ఎలా? అంటే ఇది అసాధ్యమని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే వారం విడిచి వారం సస్పెన్సు గుప్పిస్తూ సీరియల్సు రాసే రచయితలు, ప్రతి రోజూ లక్షల మంది ఆడవాళ్ళను ఏడిపించే టివి డైలీ సీరియల్ డైరక్టర్లు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

అంతెందుకు.. యండమూరి ఏదో పుస్తకంలో రాసాడు దాదాపు పదో, పదిహేనో సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఏదో ఒక పత్రిక కోసం కథో, సీరియల్ భాగమో రాసానని. డా మాలతీ చందూర్ గత 47 సంవత్సరాలుగా మొదట ఆంధ్రప్రభ వారపత్రికలో, ఇప్పుడు స్వాతి వారపత్రికలోను కాలమ్ నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా పాటల రచయితల సంగతి చూడండి. వేల కొద్దీ పాటలు అలవోకగా రాసేస్తారు. వేటూరి, సిరివెన్నెల ఎన్ని వందల అందమైన పాటలు రాసారు, ఇంకా రాస్తున్నారు! వారికది ఎలా సాధ్యమా అని ఎన్నిసార్లు అనుకుని ఉంటానో! ఇళయరాజా ఎన్నో పాటలకు నిముషాల్లో అందమైన ట్యూన్లు కట్టాడట. ఒక సినిమా రీరికార్డింగు మొత్తం ఒకే రోజులో చేసెయ్యగలడట! మరి ఆ మహానుభావుని సృజనను శంకించగలమా? (లెంపలేసుకుంటున్నాను). సృజనాత్మకమైన పనులు చేయడానికి స్పందించే మనసు అవసరం కదా, అంటే దానర్థం ఆ రచయితల, కళాకారుల మనసు ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుందనా? బహుశా అదే అయ్యుంటుంది. వేలమందిని స్పందింపజేసే సృజన వారికి దేవుడిచ్చిన వరం కాబోలు. అందుకే వారు గొప్పవారయ్యారు.

*** సశేషం ***